భద్రాచలం కాంగ్రెస్ లో బగ్గుమన్న విబేధాలు
- వీధిన పడ్డ పోదెం, తెల్లం వర్గాల మధ్య ఆధిపత్య పోరు
- దుమ్ముగూడెం మండలంలో తెల్లానికి వ్యతిరేకంగా ప్లెక్షీలు
- ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుతో బయట పడ్డ అసంతృప్తి
ఒక్క సారిగా భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు బగ్గుమన్నాయి. మాజీ
ఎమ్మెల్యే,
రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య, స్థానిక ఎమ్మెల్యే తెల్లం
వెంకట్రావుల మధ్య కొంత కాలంగా ఏర్పడ్డ అగాధం కాస్త, వివాదంగా మారి వీధిన పడింది. దుమ్ముగూడెం
మండలంలోని ములక పాడు సెంటర్, నర్సాపురం, లక్ష్మీ నగరంలో ఎమ్మెల్యే తెల్లంకు వ్యతిరేకంగా ప్లెక్షీలు
వెలిశాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమక్షంలో ఇందిరమ్మ కమిటీలు వేస్తూ నిజమైన
కాంగ్రెస్ కార్యకర్తలకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ పలు చోట్ల ప్లెక్షీలు
పెట్టారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికే ఇందరమ్మ కమిటీల్లో
స్థానం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకూ నివురు గప్పిన
నిప్పుగా వున్న వర్గ పోరు, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సందర్భంగా బగ్గు మనడం భద్రాచలం
నియోజక వర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్న పొదెం వీరయ్య, ఉప ముఖ్యమంత్రి మల్లు
బట్టి విక్రమార్కకు ప్రధాన అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ
చేసి, బీఆర్ఎస్ నుండి పోటీ
చేసిన ఇదే తెల్లం వెంకట్రావు చేతిలో ఓడి పోయారు. ఆ తర్వాత, గెలిచిన తెల్లం వెంకట్రావు
కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెల్లం రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. తెల్లం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి
ఒక సారి కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికలు దగ్గర పడగానే, కాంగ్రెస్ టిక్కెట్ రాదని
గ్రహించి తిరిగి బీఆర్ఎస్ లో చేరి టిక్కెట్ సంపాధించుకున్నారు. కాంగ్రెస్ తరుపున సిట్టింగ్
ఎమ్మెల్యేగా వున్న పొదెం వీరయ్య పోటీ చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో
తెల్లం వెంకట్రావు గెలిచి మళ్ళీ రెండవ సారి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం పొంగులేటి
అనుచరుడిగా కొనసాగుతున్నారు. మొదటి నుండీ పొదెం, తెల్లం వర్గాల మధ్య పొసగడం
లేదు. నియోజక వర్గంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే వుంది. నియోజక
వర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగినా ఇద్దరూ కలసి వేదికను పంచుకోవడం లేదు. అంతే
కాకుండా, తెల్లం వెంకట్రావుపై ఒక
వేళ అనర్హత వేటు పడితే, ఉప ఎన్నికలో కాంగ్రెస్ టిక్కెట్ పొదెం వీరయ్యకే ఇవ్వాలని
ఆయన అనుచరులు ఇప్పటికే కోరుతున్నారు. ఇద్దరి మధ్య చినికి చినికి గాలి వానగా మారిన
ఈ వర్గ పోరు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది. మరి ఉప
ముఖ్యమంత్రి బట్టి,
మంత్రి పొంగులేటి వీరుద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారా ? లేక తమ అనుచరులనే
వెనకేసుకొస్తారా ?
అన్నది చూడాలి.
Comments
Post a Comment