మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి

Kothagudem SP Rohith Raju

 

  •          పోలీసుల సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
  •        గంజాయి సేవించే వారిపైనా కేసులు పెట్టాలని ఆదేశం
  •          సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన  

 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా వుంటూ,  వారి కదిలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో నెల వారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, జూదం, బెట్టింగు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారని, ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి, నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అవగాహనా కార్యక్రమాల ద్వారా అప్రమత్తం చేయాలని కోరారు. దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి, నివారణాచర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు,చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. న్యాయాధికారులతో సమన్వయం చేసుకొంటూ పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, కేసులను వెంటనే పరిష్కరించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని కోరారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫింగర్ ప్రింట్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన చంద్రుగొండ ఎస్సై స్వప్నను అభినందించారు. ఈ సమావేశంలో ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగ రాజు, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Kothagudem Police

Janechcha


Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే