ఈ గోడ ఎక్కడి వరకు ?
- 40 ఏళ్లలో మున్నేటికి ఎన్నడూ లేనంత వరద
- రక్షణ గోడల డిజైన్ మార్చే పనిలో అధికారులు
- దంసలాపురం వరకూ నిర్మించాలంటున్న బాధితులు
ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంపు నుండి కాపాడేందుకు ప్రభుత్వం రక్షణ గోడలు నిర్మిస్తోంది. పోలేపల్లి నుండి ప్రకాష్ నగర్ వరకూ 7.5 కిలో మీటర్ల మేర ఏటికి ఇరు వైపులా ఈ గోడలు నిర్మిస్తున్నారు. కానీ, సెప్టెంబర్ 2న మున్నేటికి వచ్చిన భారీ వరద, రక్షణ గోడల నిర్మాణానికి అధికారులు గతంలో వేసిన అంచనాలను, రూపొందించిన ప్రతి పాదనలను తల్ల క్రిందులు చేసింది. కొత్త అంచనాలను, ప్రతి పాదనలను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. తాజాగా మున్నేరు కొచ్చిన వరదకనుగుణంగా నిపుణులు, జిల్లా అధికారులు తిరిగి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందిస్తున్నారు. రానున్న వందేళ్ళలో వరదల వల్ల నగరానికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా రక్షణ గోడలను రీడిజైన్ చేస్తున్నారు. ఎప్పటి కప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అందుకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు కొత్త డిమాండ్ ఒకటి తెర పైకి వచ్చింది. పోలేపల్లి నుండి ప్రకాష్ నగర్ వరకు నిర్మిస్తున్న ఈ రక్షణ గోడలను దిగువున వున్న దంసలాపురం వరకూ పొడిగించాలని ఆ ప్రాంత మున్నేరు వరద భాదితులు కోరుతున్నారు. మొన్న వచ్చిన మున్నేరు వరదకు ఖమ్మం నగరంలోని 12 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలు నీట మినిగాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరి కొందరు డాబాల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో 16వ డివిజన్లోని అగ్రహారం కాలనీ, దంసలాపురం ప్రాంతాలు కూడా వున్నాయి. దాదాపు 1500 ఇళ్ళు నీట మునిగాయి. ఇక్కడి నివసించే వారంతా కాయా కష్టం చేసుకొని జీవించే పెదలు, రైతులే. గతంలో వీరికి ఇక్కడ ఇళ్ళ స్థాలాలిచ్చి ఇళ్ళు కట్టించింది కూడా ప్రభుత్వమే. 2023 జులైలో వచ్చిన వరదకు కూడా ఈ ప్రాంతాలు ముంపుకు గరైయ్యాయి. కానీ, ఈ ప్రాతంలో రక్షణ గోడలు నిర్మించాలని అనుకో లేదు. అధికారులు మర్చిపోయారో, ఈ ప్రాంతానికి రక్షణ గోడలు అవసరం లేదనుకున్నారో తెలియదు కానీ, ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు మాత్రమే రక్షణ గోడలు నిర్మించాలని గతంలో ప్రతి పాదించారు. ఆ మేరకే పనులు చేపట్టారు. ఇప్పుడు అంచనాలకు మించి వచ్చిన వరద వల్ల ఆ ప్రతి పాదనలను మార్చాల్సి రావడంతో, కొత్త ప్రతి పాదనలో అగ్రహారం కాలనీ, దంసలాపురాన్ని కూడా చేర్చాలని, రక్షణ గోడలను అక్కడి వరకూ పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు. 2013లో కూడా మున్నేరుకు భారీగా వరద వచ్చింది. ఆ సమయంలోనే మున్నేరుకు ఇరు వైపులా రక్షణ గోడలు నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. 2023లో మళ్ళీ 30 అడుగుల వరకూ వరద రావడంతో ఖచ్చితంగా రక్షణ గోడలు నిర్మించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పోలేపల్లి నుండి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వరకు రక్షణ గోడలు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 590 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 1న 42 అడుగుల వరకు మున్నేటికి వరద వచ్చింది. ఏటికి ఇరు వైపుల వున్న ఖమ్మం నగరం మొత్తాన్ని ముంచెత్తింది. ఆ రోజు, అంతకు ముందు రోజూ కలిపి 42 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. 1వ తేదీ రాత్రి 7 గంటల్లోనే 16.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గడచిన 40 ఏళ్ళలో ఇప్పటి వరకూ ఇంత వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రక్షణ గోడల నిర్మాణాన్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మొదట వీటిని 33 అడుగుల ఎత్తు మాత్రమే నిర్మించాలనుకున్నారు. కానీ, వాటిని ఇప్పుడు దాదాపు 42 అడుగుల పైనే నిర్మించే అవకాశముంది. ఒకవేళ రక్షణ గోడల ఎత్తు 42 అడుగులకు పైన పెంచితే, ప్రస్తుతం నగరంలో మున్నేరుపైన వున్న 3 హై లెవెల్ బ్రిడ్జిలు కూడా ఎక్కువ వరదోస్తే, మునిగి పోయే ప్రమాదముంది. అందుకే, రక్షణ గోడల ఎత్తును భారీగా పెంచడానికి బదులు మున్నేరునే వెడల్పు చేయాలన్న అల్లోచనలో కూడా అధికారులున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గోడల రీడిజైన్ పై మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దీనిపై నిపుణుల బృందం అధ్యయన చేస్తుందని చెప్పారు. రక్షణ గోడలు ఎంత ఎత్తు పెంచాలి ? ఎక్కడ వరకు నిర్మించాలన్నది నిపుణుల బృందమే నిర్ణయిస్తుందన్నారు. మరి నిపుణుల కమిటీ ఏం చెబుతుంది ? ఎలా డిజైన్ చేస్తుంది ? దంసలాపురం వరకు గోడను పొడిగిస్తారో ? లేదో చూడాలి.
Comments
Post a Comment