ఖమ్మం కేంద్రంగా ... బురద రాజకీయం
ఖమ్మం కేంద్రంగా ... బురద రాజకీయం
నడుస్తోంది. మున్నేరు ముంపుపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలు
.... రోపణలు ప్రత్యారోపణలు ... దాడులు ప్రతి దాడులకు దిగుతున్నారు. సహాయక చర్యలపై
రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ... మాజీ మంత్రి హారీష్ రావు మధ్య
ఒకవైపు మాటల తూటాలు పేలుతుండగానే ... మరో వైపు ఖమ్మంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య
ఘర్షణ జరిగింది. ముంపు ప్రాంత బాధితులకు సహాయం చేయాల్సిన చేతులతో కర్రలు రాళ్ళు
పట్టుకొని దాడులు చేసుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి
జరిగింది. సహాయం కోసం వరద బాధితులు ఆర్తనాదాలు చేస్తుంటే ... సహాయక చర్యలకు ఆటంకం
కలిగేలా ఈ గొడవలేంటి? ఈ రాజకీయమెందుని ఖమ్మం ప్రజానీకం అవాక్కవుతోంది.
మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి ఖమ్మం పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత ... వరద బాధితులను
పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపి నామ
నాగేశ్వర రావు నగరంలోని బొక్కల గడ్డకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు
ఉన్నారు. ఇరు పార్టీల నేతలు అక్కడ ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ తమ
పార్టీలు, నేతలకు అనుకూలంగా పోటా పోటీ నినాదాలు చేశారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ
రాళ్ల దాడిలో హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న కారు ధ్వంసమైంది. బీఆర్ఎస్ కార్యకర్త కాలుకు
తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి
చేరుకొని ఇరు వర్గాలను అదుపు చేశారు.
బాధితులకు సహాయం చేయడంలో ఒకరి కొకరు పోటీ పడాలి కానీ ... సహాయానికి ఆటంకం కలిగేలా ఈ గొడవలేంటని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు వరదతో సర్వం కోల్పోయిన బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ కొద్ది సహాయం దొరికినా చాలనుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికి తోచిన సాయం వారు చేయాలి. అంతే కానీ ... ఈ బురద రాజకీయాలతో ప్రజాభిమానానికి దూరం కాకూడదు.
Comments
Post a Comment