జెండా లేకపోయినా ... ఎజెండాతో షేక్ చేస్తున్న బర్రెలక్క


కదిలే ... ఓ అడుగు
యువతకు ... నువు వెలుగు
కదిలిందీ ... కదిలిందీ
మన బర్రెలక్క అదిగో
లేవర యువత యుద్దమై
కదలర యువత సిద్దమై
పల్లె పల్లెన యువత మేలుకో
బానిస లాంటి బతుకు వదులుకో
కదిలిరార యువత ... |

అంటూ ... కొల్లాపూర్ వీధుల్లో వినిపిస్తున్న ఈ పాట ... ఇప్పుడు తెలంగాణ యువత గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగ యువతను ఆలోచింపజేస్తూ ... రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. నేతలంతా ... తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన వేళ ... నాగర్ కర్నూల్ జిల్లా ... కొండాపూర్లో నిరుద్యోగుల ప్రతినిధినంటూ ... స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ... చాపకింద నీరులా ప్రచారం సాగిస్తోన్న బర్రెలక్క ... ఇప్పుడు ఆ నియోజకవర్గ అభ్యర్థులనే కాకుండా ... రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులను కూడా ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది, ఈసారి విజయం మాదే ... మళ్ళీ మేమే గెలుస్తామనే అభ్యర్థులు సహితం ... ఈ ఎన్నికల్లో బర్రెలక్క ప్రభావం ఏమైనా ... తమపై ఉంటుందా ? ... అని ఒకసారి ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం ... కొండాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కే ... జెండా లేకపోయినా ... ఎత్తుకున్న ఎజెండాతో తెలంగాణ యువతను విపరీతంగా ఆకర్షిస్తూ ... రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తోంది.

కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ... డిగ్రీ చదివి ప్రస్తుతం బిఈడి చేస్తోంది. డిగ్రీ పూర్తయినా ఉద్యోగం రాకపోవడంతో ... వాళ్ళ అమ్మ కొనిచ్చిన బర్రెలు కాస్తూ పొట్టపోసుకుంటుంది. బర్రెలు కాస్తున్న సమయంలో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ... బర్రెలక్కగా ఫేమస్ అయ్యింది. యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి పాలకుల విధానాలే కారణమని భావించిన బర్రెలక్క , ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకుంది. నిరుద్యోగుల పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలన్న ఉద్దేశ్యంతో నామినేషన్ వేసి ... కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీకి దిగింది. ఈ ప్రయత్నంలో కొంత మంది ఆమెను నిరుత్సాహపర్చినా ... తల్లి సహకారంతో నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన తర్వాత కూడా ... బర్రెలక్క పోటీలో ఉంటుందా ... రాజకీయ వత్తిళ్లతో పోటీనుండి తప్పుకుంటుందా ? అన్న అనుమానాలు కూడా చాలా మందిలో కలిగాయి. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.

బర్రెలక్కకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల నుండి మద్దతు లభిస్తోంది. ప్రింట్ అండ్ ఎలట్రానిక్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. అనేక మంది ... ఎంతో కొంత ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. పుడిచ్ఛేరి ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయల విరాళం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ... బర్రెలక్క తరుపున ప్రచారం చేయడానికి కొల్లాపూర్ చేరుకుంటున్నారు. ప్రచారానికి సమయం ... తగినన్ని వనరులు లేకపోయినా ... బర్రెలక్క ఆటోలో తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మరో వైపు సోషల్ మీడియాను తన ప్రచారానికి వాడుకుంటోంది . ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ... ప్రధాన పార్టీలకు గుబులు కూడా పుట్టిస్తోంది. నిరుద్యోగుల ఓట్లు ఎక్కడ తమకు దూరమౌతాయోనన్న ఆందోళనలో పడ్డారు.

రాష్ట్ర మంతా బర్రెలక్క ప్రభావం ఉంటుందని చెప్పలేం ... కానీ, బర్రెలక్క ఎజెండాకు నిరుద్యోగులు ఆకర్షితులవుతున్నారు. దీనివల్ల వారు ఏపార్టీకి దగ్గరవుతారు .. ఏపార్టీకి దూరమవుతారన్నదే రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. బర్రెలక్క ప్రభావం కొల్లాపూర్కే పరిమితమవుతుందా ? బయట నియోజక వర్గాలపై ఏమైనా పడుతుందా ? అని రాజకీయ విశ్లేషకులు కూడా నిశితంగా గమని స్తున్నారు. చివరకు ఏమైద్దో చూడాలి. ఏది ఏమైనా ... బర్రెలక్క తీసుకున్న నిర్ణయం ... గత పాలకుల యువత వ్యతిరేక విధానాలకు ... వారి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష ధోరణికి అద్ధం పడుతుందనడంలో సందేహం లేదు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే