చైర్మన్, వార్డుల రిజర్వేషన్ మార్పుతో మారనున్న ఆశావాహుల తలరాతలు

Madhira

  • తొలిసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు
( తాళ్లూరి అప్పారావు, మధిర )

మధిర మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావాహులు తమ తలరాతలు మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్లో ప్రకటించిన చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు గతంలో ఉన్న రిజర్వేషన్లకు పూర్తి భిన్నంగా ఉండటంతో గతంలో ఆ అవార్డుల్లో పోటీ చేసిన వారు ప్రస్తుతం వేరే వార్డులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా చైర్మన్ పదవి కూడా గత రెండు పర్యాయాలు ఎస్సి మహిళకు రిజర్వుడ్ కాగా తొలిసారిగా జనరల్ మహిళలకు కేటాయించడంతో మధిర మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. కోర్టుల తీర్పులకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే నిబంధనతో మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను 11 వార్డులు రిజర్వేషన్ పోగా మరో పదకొండు వార్డులు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించారు. అయితే గతంలో జనరల్ గా ఉన్న 9,10 వార్డులు ఎస్సీలకు కేటాయించగా గతంలో ఎస్సీ కి రిజర్వుడుగా ఉన్న 11,12 వార్డులు ప్రస్తుతం జనరల్ కు మారాయి. గత ఎన్నికలలో జనరల్ గా ఉన్న13,14,15 వార్డులు ప్రస్తుతం బీసీలకు కేటాయించారు. బీసీ రిజర్వుడుగా ఉన్న17,18 వార్డులను ప్రస్తుతం జనరల్ వార్డులుగా మార్చారు. ఇప్పటివరకు ఆ అవార్డులలో పోటీ చేద్దామనుకున్న అభ్యర్థులు రిజర్వేషన్లు మారడంతో కంగుతిన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఏ వార్డులో పోటీ చేస్తే తమకు గెలుపు అవకాశాలు ఉంటాయో అని రిజర్వేషన్లు ప్రకటించడంతో వార్డులను వెతుక్కునే పనిలో పడ్డారు. అంతేకాకుండా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రధాన పార్టీలలో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు తమ సతీమణులను గెలిచే అవకాశం ఉన్న వార్డులలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ప్రధానంగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జనరల్ మహిళా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో ఎస్సీ, బీసీ వర్గాలకు కేటాయించిన వార్డులు కీలకంగా మారడంతో ఆయా వర్గాల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రం కానుంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు పూర్తిగా మారిపోవడంతో కొందరు కొత్త నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతుండగా, సిట్టింగ్ వార్డు కౌన్సిలర్లు తాము పోటీ చేసేందుకు పదిలమైన స్థానాల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు అవకాశం పెరగడం వల్ల స్థానిక రాజకీయాల్లో కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్లు మారడం మధిర మున్సిపాలిటీగా మారిన తర్వాత చైర్ పర్సన్ పదవిని మొదటిసారి జనరల్ మహిళకు కేటాయించడంతో జనరల్ మహిళలకు కేటాయించిన వార్డులలోనే కాకుండా, జనరల్ వార్డులలో కూడా తమ సతీమణులను పోటీ చేయించి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు  అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికలు రసవత్తరంగా జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

Popular Posts

చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు