లోకేశ్ పై కేటీఆర్ పొగడ్తలు ... తెలంగాణలో బీఆర్ఎస్ కొత్త వ్యూహానికి సంకేతమా ?
కేటీఆర్ వ్యాఖ్యలు ... వ్యూహాత్మక మార్పుకు సంకేతమా ?
నారా లోకేష్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్
స్పందిస్తూ, "కలవ లేదు కానీ... నేను లోకేష్‌ను కలిస్తే తప్పేంటి?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు పట్ల బీఆర్ఎస్ ఇప్పటి వరకు అనుసరించిన వైఖరికి పూర్తి భిన్నంగా
ఉన్నాయి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని "చంద్రబాబు శిష్యుడు"గా
అభివర్ణిస్తూ, తెలంగాణలో
రాజకీయ లబ్ది పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ, ఇప్పుడు లోకేష్‌ను పొగడటం, ఆయనతో భేటీని
సమర్థించుకోవడం బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో మార్పును సూచిస్తోంది.
దూరం... సాన్నిహిత్యంగా మారుతోందా ?
బీఆర్ఎస్, టీడీపీ
మధ్య మొదటి నుండీ విభేదాలు ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)
ఆంధ్రప్రదేశ్ విభజన, ఉమ్మడి
రాష్ట్రాల సమస్యలపై టీడీపీని తీవ్రంగా విమర్శించింది. చంద్రబాబు నాయుడు కూడా పలు
సందర్భాల్లో కేసీఆర్, బీఆర్ఎస్‌లపై
విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే, ఇప్పుడు లోకేష్‌ను పొగడటం, రేవంత్ రెడ్డిపై విమర్శలు
చేయడానికి లోకేష్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు
దారి తీసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తర్వాత,
బీఆర్ఎస్
ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి వచ్చింది. అదే సమయంలో, ఏపీలో చంద్రబాబు
నాయుడు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో
బీఆర్ఎస్ "గురు శిష్యులు"గా అభివర్ణించే చంద్రబాబు, రేవంత్ రెడ్డి
అధికారంలో ఉండడం వల్ల, ఈ బంధాన్ని తెంచి, తెలుగుదేశం పట్ల సానుకూల వైఖరి
అవలంబిస్తూ తెలంగాణలో కొంత రాజకీయ లబ్ది పొందాలని బీఆర్ఎస్ యోచిస్తుందా ? అన్న చర్చ జరుగుతోంది.
టీడీపీ ఓటు బ్యాంక్ ... బీఆర్ఎస్ వ్యూహం ?
ఎందుకంటే, మొదటి
నుండి టీడీపీకి కాంగ్రెస్ రాజకీయ శత్రువు, ఆ రెండు పార్టీల మధ్య మైత్రి
కుదిరే అవకాశం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పోటీ చేయక పోవడంతో, ఇక్కడున్న ఆ పార్టీ
ఓటర్లు ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. టీడీపీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న
నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎక్కువ చోట్ల గెలిచింది. ముందు ముందు ఏ
ఎన్నిక వచ్చినా... కాంగ్రెస్‌ను ఓడించాలంటే టీడీపీ సానుభూతిపరుల ఓట్లకు గాలం వేయడం
బీఆర్ఎస్‌కు చాలా అవసరం. ఎలాగూ... ఇప్పటికిప్పుడు టీడీపీ తెలంగాణలో ఎన్నికల్లో
పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి, టీడీపీతో సానుకూల వైఖరి ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి
ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావించి ఉండొచ్చు. అందులోనూ... కొద్ది రోజుల్లో
తెలంగాణలో స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు
జరగనున్నాయి. అంతే కాకుండా, గోషామహల్, ఖైరతాబాద్ నియోజక వర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరిగే
అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రి, చంద్రబాబు తనయుడైన లోకేష్ పట్ల
కేటీఆర్ సానుకూల వైఖరిని ప్రదర్శించడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ
విశ్లేషకులంటున్నారు. అయితే, ఇది బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంలో అంతర్గత వైరుధ్యాన్ని చూచిస్తోందని
కూడా మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఒక వైపు రేవంత్ రెడ్డిని "చంద్రబాబు
శిష్యుడు" అని విమర్శిస్తూ, చంద్రబాబును, రేవంత్‌ను ఒకే గాటన కట్టిన బీఆర్ఎస్, మరో వైపు లోకేష్‌ను
కలవడాన్ని ఎలా సమర్థించుకుంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎందాక ఈ పయనం?
కాగా, భవిష్యత్ లో తెలుగుదేశం పట్ల బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకేనా? లేక బీఆర్ఎస్, టీడీపీ మధ్య కొత్త స్నేహ బంధానికి నాంది పలకనున్నాయా? అన్న చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి తగ్గట్టుగానే, బీఆర్ఎస్ తన రాజకీయ ఎత్తుగడలను మార్చుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ఈ వైఖరికి అనేక కారణాలు ఉండవచ్చని కూడా అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి కొత్త వ్యూహాలను అన్వేషిస్తోంది. పొరుగు రాష్ట్రంలోని బలమైన పార్టీలతో సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ తమ ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ భావించే అవకాశముంది. అదే సమయంలో, లోకేష్‌ను పొగడటం ద్వారా తెలంగాణలో లబ్ది పొందాలని చూడొచ్చు. వీటిలో నిజం ఉండొచ్చు, లేక పోవొచ్చు. కానీ, కేటీఆర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చకు తెర లేపాయి. బీఆర్ఎస్, టీడీపీ మధ్య భవిష్యత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Comments
Post a Comment