ఇంట్లో బాగు చేసుకోలేని సన్నాసులు ... ! కేటీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఖమ్మం పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రంగా ఖంఢించారు. ప్రజలు, విలేకర్లు సహితం అసహ్యించుకొనేలా నోటికొచ్చినట్లు మాట్లాడారని మండి పడ్డారు. ఒక్కళ్ళిద్ధరి అక్కసుకో, అసూయకో ఈ ప్రజాస్వామ్యం బలై పోవాలా ? వాళ్ళు వాడే భాషకు మన మందరం తెలుగు ప్రజలుగా తల దించుకోవాలా ? అన్నది తనకు అర్ధం కావట్లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఖమ్మం అర్భన్ పార్కులో మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో సరి చేసుకోలేని సన్నాసులు, రాష్ట్రాన్నీ, దేశాన్నీ ఏదో చేస్తామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వాళ్ళు, పదే పదే అవే మాటలు మాట్లాడుతున్నారంటే ... ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదని అర్ధమవుతుందన్నారు. ఇక ముందు కూడా బుద్ధి రాదన్నారు. గోదావరి, బనక చర్ల, కూలిన కాళేశ్వరంపైన బొంకిందే బొంకుతున్నారని విమర్శించారు. ఒక ప్రక్క పెద్దాయని ఏదిపడితే అది మాట్లాడొద్దని చెబుతున్నా వినకుండా బయట ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. దయ చేసి ఇకనైనా సరే, అసహ్యకరమైన, నీచమైన, దుర్మార్ఘమైన భాషను మానుకుంటే మీకే మంచిదని హితవు పలికారు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వున్నారు కాబట్టి ప్రస్తావించాల్సి వస్తుంది కానీ .. లేక పోతే ... మీపేరూ ... ఊరూ ఎత్తాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. “ ఎవడు పీకేది లేదు ... ఎవడిది ఎవడు పీకేది లేదు. ఎవర్నైనా పీకాల్సి వస్తే ప్రజలే పీకుతారు. ప్రజలతో పీకిచ్చుకొన్నోళ్ళు కూడా పదే పదే నాయేం పీకుతావు ? అంటే ఎలా ? అంత అసభ్యకరమైన భాష నేను మాట్లాడదల్చుకో లేదు. ఊర్కే చర్చలంటారు ... ఏమని చర్చించమంటారు ?. 4 కోట్ల మంది చర్చించి ... చర్చించి మీరిచ్చిన వాగ్దానాల మీద, వాటి అమలు మీద తీర్పు చెప్పారు.” ఇంకే చర్చించమంటారని తుమ్మల ప్రశ్నించారు. మీ వైఫల్యం వల్ల అన్ని రంగాలు, అన్ని శాఖలు దివాళా తీసి, మిగులు రాష్ట్రం అధోగతి పాలైనందుకు చర్చించమంటారా ? నిపుణులు చెప్పిన దాన్ని కూడా కాదని, కట్టరాని చోట ప్రాజెక్టు కట్టి, లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడంపై చర్చించమంటారా ? లేదూ ... ఈ రోజు జరుగుతున్న ప్రజా సంక్షేమంపైన చర్చిస్తారా ? అంటూ కేటీఆర్ ను నిలదీశారు. అసలు మనం మనం చర్చించు కోవాల్సిన అవసరం లేదని, మీ సంక్షేమాన్ని, మీ ప్రవర్తనను, మీ అహంకారాన్ని, మీ భాషను చూసిన తర్వాత, ప్రజలు చర్చించి ఒక నిర్ణయం చేశారన్నారు. ఆ నిర్ణయం చేసి ఏడాదిన్నర కూడా కాలేదని ... మళ్ళీ చర్చించే సమయం వచ్చినప్పుడు ప్రజలే చర్చిస్తారని అన్నారు. రేపు జరిగే లోకల్ బాడీ ఎలెక్షన్లలో ఏం చేస్తారో చూద్దురు గాని ... కాస్త ఓపిక పట్టండని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా అన్నారు.
Comments
Post a Comment