రాజకీయ జోక్యంతో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
- సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లుఆరోపణ
- భద్రాచలం ఎండిఓ కార్యాలయం ఎదుట ధర్నా
ఇందిరమ్మ కమిటీలపేరుతో రాజకీయ జోక్యం ఎక్కువై అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు
రావడం లేదని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఆరోపించారు.
శుక్రవారం పట్టణ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలం
ఎండిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మచ్చ
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై
ఇంటింటి సర్వే నిర్వహించి, తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులకు తెలియజేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ట్లు అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఆరు గ్యారంటీల అమలులో
ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
చేయాలని కోరారు. సొంత స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్
చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, ఫించన్లు కొత్తగా ఇవ్వ లేదని, ప్రభుత్వం మారినా అదే
పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాక పోవటం
దారుణమన్నారు. అనేక మంది పేదలకు ఫ్రీ కరెంటు, గ్యాస్ సబ్సిడీ అందడం లేదని తెలిపారు.
భద్రాచలం పట్టణం గోదావరి వరద ముంపుకు గురి కాకుండా కరకట్ట ఎత్తు పెంచడంతో పాటు
పొడిగించాలన్నారు. సుభాష్ నగర్ శివారులో పొడిగిస్తున్న కరకట్ట పనులను సత్వరమే
పూర్తి చేయాలన్నారు. పట్టణ శివారు కాలనీలలో కరెంటు స్తంభాలు లేక చీకటిలో మగ్గుతున్నారని, తక్షణమే కరెంటు
స్తంభాలు వేయాలని కోరారు. రామాలయం దగ్గరలో కరకట్టపై వున్న చెత్త డంపింగ్ యార్డ్ ను
తక్షణమే పట్టణ శివారు ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో
పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి
వర్గ సభ్యులు పి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల
లీలావతి ఉస్తేలా జ్యోతి, నకిరికంటి నాగరాజు, కుంజా శ్రీనివాస్, చుక్కా మాధవ రావు, జీవనజ్యోతి, చాట్ల శ్రీనివాస్,ఎస్ భూపేంద్ర, కోరాడ శ్రీనివాస్, అజయ్ కుమార్, డి రాఘవయ్య, కొలగాని రమేష్, డి కనక శ్రీ తదితరులు
పాల్గొన్నారు.

Comments
Post a Comment