మావోలు ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేస్తున్నారు

 

SP Rohith Raju, Bhadradri Kothagudem

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విమర్శ
  • చత్తీష్ ఘడ్ సరి హద్దులో బీటీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
  • ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తో కలిసి బైక్ పై ప్రయాణం

నిషేధిత మావోయిస్టులు ఆదివాసి ప్రజలను అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విమర్శించారు. గురువారం చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామం నుండి చత్తీష్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన 2 కిలో మీటర్లు బీటి రోడ్డును ఆయన సందర్శించారు. చర్ల నుండి ద్విచక్ర వాహనంపై వెళ్ళిన ఎస్పీ రోహిత్ రాజు బీటీ రోడ్డుతో పాటు నిర్మాణంలో వున్న కల్వర్ట్, కాజ్ వేల పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా మూడు కోట్ల రూపాయల వ్యయంతో పూసుగుప్ప నుండి చత్తీష్ ఘడ్ లోని రాంపురం, భీమారం గ్రామాలలో నివసించే ఆదివాసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు. తాము నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలోనే పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాల్లో దాదాపుగా పూర్తయిన మొబైల్ హాస్పిటళ్లను ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడే ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా ముందుండి పూర్తి చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పాలసీకి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న వివిధ క్యాడర్లకు చెందిన చాలా మంది ఇప్పటికే లొంగిపోయారని, మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న మిగిలిన నాయకులు, సభ్యులు కూడా లొంగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్బంగా ఎస్పీ రోహిత్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments