ధరణిలో లేనివి భూ భారతిలో వున్నాయి

Srija, Khammam Additional Collectaor


  • ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ
  • పైలెల్ ప్రాజెక్ట్ గా ఎంపికైన నెలకొండ పల్లిలో అవగహనా సదస్సు

ధరణి పోర్టల్లో దొరకని అనేక సమస్యలకు పరిష్కారం భూ భారతి చట్టంలో దొరుకుతుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. రైతుల భూములకు భరోసా కల్పించే చట్టమే భూ భారతి చట్టమని చెప్పారు. గురువారం పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన నేలకొండ పల్లి మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రజల కోసం, ప్రధానంగా రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీ-సేవలో లాగే దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని, భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. భూ భారతి చట్టం భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడు తుందన్నారు. ఒక వేళ రైతులకు ఎవరికైనా న్యాయ సహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. పాత పోర్టల్ ధరణి నుండి క్రొత్త పోర్టల్ భూ భారతికి షిఫ్ట్ అవుతున్నందున లోటు పాట్లు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి పైలట్ స్టడీకి రాష్ట్రంలో 4 మండలాలు ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో మన జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేశారని, ఇది రాష్ట్రం తరఫున పెద్ద బాధ్యతని, అందరం కలిసి పని చేయాలని కోరారు. సదస్సులో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై  రైతులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్న పూసల సీతారాములు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, తహసీల్దార్ తఫజ్జుల్ హుస్సేన్, ఎంపిడివో ఎర్రయ్య, మండల వ్యవసాయ అధికారిణి రాధ తదితరులు పాల్గొన్నారు.

Comments